కర్ణాటకలో కాంగ్రెస్‌ మైండ్‌గేమ్‌…సిద్దిరామయ్యను అందుకే పక్కనపెట్టారా?

Karnataka Congress Leadership Change

Karnataka: కర్ణాటకలో ఎన్నికల సంగ్రామానికి ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈలోగా అక్కడి ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్‌ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దిరామయ్య చేత రాజీనామా చేయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చడం షరామామూలే. అయితే, ఎన్నికలకు ముందు డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించడం వలన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటుబ్యాంకును పెంచుకోవాలని చూస్తోంది.

అంతేకాకుండా, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం డీకేనే. ఆయన ప్రతీ నియోజకవర్గంలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకున్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకిస్తూ ఓటర్లను కూడగట్టాడు. డీకే వ్యూహం ఫలించడంతో… ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాల్సి ఉన్నా… సిద్దిరామయ్య ఉండటంతో మూడేళ్లపాటు ఆయనకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. కాగా, ఇప్పుడు డీకేను ముఖ్యమంత్రిని చేయడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ నమ్ముతోంది.

అయితే, సిద్దిరామయ్య వర్గానికి చెందని ఎమ్మెల్యేలు డీకేతో కలిసి పనిచేస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సిద్దిరామయ్య అందరివాడుగా గుర్తింపు ఉంది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో సంప్రదింపులు ఉంటాయి. కానీ, డీకే దూకుడు ఉన్న వ్యక్తిగా గుర్తింపు. పైగా ఆయనపై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయి. పార్టీలో డీకేను వ్యతిరేకించేవారు ఉన్నారు. సిద్దిరామయ్యను పక్కనపెట్టడం ఆయన వర్గం ఎంతవరకు ఒప్పుకుంటుంది అన్నది చిక్కుప్రశ్న.

కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం సిద్దిరామయ్యను పక్కన పెట్టడం వలన రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకునే అవకాశం ఉందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇది కలిసి వచ్చే అంశంగా మారుతుందని అంటున్నారు. మరి అధికారం మార్పు కాంగ్రెస్‌కి కలిసి వస్తుందా లేక బీజేపీకి లాభం చేకూరుస్తుందా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలుతుంది.

Also Read  స్టాలిన్‌ వార్నింగ్ః అదే జరిగితే తమిళనాట మరో యుద్ధమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *