11/06/2026
Karimnagar New Collectorate Set to Boost District Development

Karimnagar New Collectorate Set to Boost District Development

కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించిన మంత్రి, భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ జిల్లా అభివృద్ధికి పరిపాలనా కేంద్ర బిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

గతంలో ప్రారంభమైన కలెక్టరేట్ నిర్మాణ పనులు వివిధ కారణాలతో పూర్తికాక నిలిచిపోయాయని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక చొరవ తీసుకుని మిగిలిన పనులను వేగవంతం చేసి పూర్తిచేయించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం సహకారంతో అన్ని ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వసతులు, పౌరులకు అనుకూలమైన సేవా వ్యవస్థతో కూడిన కలెక్టరేట్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని వెల్లడించారు. కలెక్టరేట్ ప్రారంభం అనంతరం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

సుడా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో విస్తృత స్థాయిలో గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పర్యావరణ హిత వాతావరణం, విశాలమైన కార్యాలయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వ్యవస్థతో ఈ కలెక్టరేట్ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా నిలుస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంలో నూతన కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్‌ను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

జిల్లాను పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సహచర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఏర్పాటు ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయని చెప్పారు. గతంలో నిలిచిపోయిన విద్యా అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపునిస్తూ మరిన్ని కోర్సులు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Also Read  కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు

ఆరోగ్య రంగంలో కరీంనగర్‌ను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మెడికల్ కాలేజీని టీచింగ్ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌ను కూడా త్వరలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. మానేరు రివర్‌ఫ్రంట్ రెండో దశ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, డంప్‌యార్డు తరలింపునకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *