శ్రీవేంకటేశ్వర స్వామివారికి సమర్పించిన పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలో ఉన్న ఓ బావిలో వేస్తుంటారు. ఈ బావినే పూలబావి అని పిలుస్తారు. ఈ పూలబావికే భూతీర్థం అనే పేరుకూడా ఉంది. భూదేవి చేత ఏర్పరచబడిన క్షేత్రం కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. అయితే, ఈ బావిని ఎలా ఎవరు నిర్మించారు అనే దానిపై తిరుమల పెద్దల ఈ విధంగా చెబుతారు. శ్రీనివాసుని ఆనతి మేరకు రంగదాసు అనే భక్తుడు బావిని తవ్వాడు. అప్పటి నుంచి భూ తీర్థం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇలా రంగదాసు బావిని తవ్వి ఆ నీళ్లతో స్వామివారి కైంకర్యాల కోసం పూల మొక్కలను పెంచారు. అలా అక్కడ ఓ పెద్ద తోట పెరిగింది. కాల క్రమంలో రంగదాసు మరణించడం, మరలా ఆయనే తొండమాను చక్రవర్తిగా జన్మించడం జరిగింది. రంగదాసుకు చెప్పిన విధంగానే తొండమానుకు కూడా స్వామివారు కలలో కనిపించి బావిని పునరుద్దరించబమని ఆదేశించాడు. ఆ విధంగా తొండమాన్ చక్రవర్తి బావిని పునరుద్దరించి రాతితో కట్టించాడు. సంతోషించిన శ్రీనివాసుడు తొండమానుడికి ఓ వరం ప్రసాదించాడు.
ఆటో డ్రైవర్ల సమస్యకు హైడ్రా శాశ్వత పరిష్కారం
రాతితో కట్టిన బావిలోనే ఓ రహస్యబిలం ఏర్పాటు చేసుకొని ఆ బిలం ద్వారా తొండమాన్ చక్రవర్తి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకునేవాడు. ఈ బిలం ఎలా ఉపయోగపడింది అంటే ఒకప్పుడు యుద్దంలో శతృవులతో తరుమబడిన తొండమానుడు రహస్యబిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని సన్నిధికి చేరాడట. అలా సన్నిధికి వచ్చిన సమయంలో శ్రీదేవి శ్రీవారితో ఏకాంత సేవలో ఉంది. తొండమానుడు అక్కడికి రావడం చూసి శ్రీదేవి శ్రీవారి వక్షస్థలంలో ఉండిపోగా, భూదేవి తొండమాను కట్టించిన బావిలో దాక్కున్నదట. ఈ వివరాలను వరాహ పురాణాంతర్గత వేంకటాచల మహత్మ్యంలో వివరించారు. రామానుజులవారు తిరుమలకు వేంచేసినపుడు పూలబావిలో భూదేవి కొలువై ఉందని గ్రహించి అక్కడే అమ్మవారిని ప్రతిష్టించి తీర్థాధిపతిగా శ్రీవారికి అర్చన నివేదనాదులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ స్వామివారికి అలంకరించబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసం పూలబావిలో వేసేవిధంగా నిర్ణయం చేశారని శ్రీవేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం చెబుతున్నది.
నాటి నుంచి నేటి వరకు శ్రీనివాసునికి అలంకరించబడి తొలగించిన పూలమాలలు, తులసి మాలలను పూలబావిలోనే వేస్తున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే పూలను బావిలో కాకుండా తిరుచానూరులోని అమ్మవారికి కానుకగా సమర్పిస్తుంటారు. అదీ కార్తీక బ్రహ్మోత్సవం సమయంలోనే. కార్తీక బ్రహ్మోత్సవానికి తిరుమల నుంచి అమ్మవారికి సారె వస్తుంది. ఆ సారెతోపాటు స్వామివారికి అలంకరించిన పూలమాలలు కూడా వస్తాయి. స్వామివారి నుంచి వచ్చిన సారెను అమ్మవారికి నివేదించిన తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో నిర్మాల్యాన్ని బావి నుంచి తొలగించి శేషాచలం అడవుల్లో ఎవరూ తొక్కని చోట ఆ నిర్మాల్యాన్ని జారవిడుస్తారు. ఆలయంలోని ప్రముఖులకు మాత్రమే బావిని సందర్శించే అవకాశం ఉంటుంది.