•ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలసిన ఎమ్మెల్యేలు:
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో రోడ్లు, డ్రెయిన్లతోపాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్పీ భేటీ అనంతరం వీరంతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు, మండపేట శాసనసభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారు, ముమ్మడివరం శాసన సభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, అమలాపురం శాసన సభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు తదితరులు ఉప ముఖ్యమంత్రిని కలసిన వారిలో ఉన్నారు.
•రూ. 65.15 కోట్ల సాస్కీ నిధులతో 4 నియోజకవర్గాల్లో 40 రోడ్ల అభివృద్ధి:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో రూ. 65.15 కోట్ల సాస్కీ నిధులతో 40 ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో మండపేట నియోజకవర్గానికి రూ. 22.75 కోట్లు, అమలాపురం నియోజకవర్గానికి రూ. 16.18 కోట్లు, కొత్తపేటకు రూ. 14.93 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గానికి రూ. 11.28 కోట్లు కేటాయించారు. 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్లే కరకట్ట రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ సత్యానందరావు గారి అభ్యర్ధన మేరకు సాస్కీ నిధుల నుంచే రూ. 6 కోట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు.

•పలువురు ప్రజా ప్రతినిధులు భేటీ:
శాసన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పలువురు శాసన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాళహస్తి శాసన సభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు, మైదుకూరు శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, గన్నవరం శాసన సభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల పరిధిలో పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తిలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆహ్వానపత్రిక అందజేశారు.