తెలంగాణలో కులగణన…అత్యధికంగా ఉన్న కులాలు ఇవే

elangana Caste Census 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వే’ (కులగణన) తుది వివరాలు వెలువడ్డాయి. రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ గణంకాలను విడుదల చేస్తూ, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో ఈ డేటా దిక్సూచిగా మారుతుందని పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణ మొత్తం జనాభా 3,54,77,554 గా నమోదైంది. ఇందులో వెనుకబడిన తరగతుల (BC) జనాభా సింహభాగం ఆక్రమించింది. ముస్లిం బీసీలను కూడా కలుపుకుంటే రాష్ట్రంలో వీరి జనాభా 46.25 శాతం (సుమారు 1.64 కోట్లు) కాగా, ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతంగా ఉన్నారు.

కులాలు మరియు సామాజిక వర్గాల వారీగా చూస్తే రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరమైన గణాంకాలు వెలుగుచూశాయి. మాదిగ కులం 36,57,551 (10.3%) జనాభాతో రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ముదిరాజ్ (7.4%), లంబాడీ/బంజారా (6.8%), మరియు యాదవ (5.7%) వర్గాలు ఉన్నాయి. ఓసీ సామాజిక వర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం 4.8 శాతం (17.10 లక్షలు) జనాభాతో అగ్రస్థానంలో ఉంది. బీసీల్లో ముదిరాజ్ తర్వాత గౌడ్, మున్నూరు కాపు, పద్మశాలి వర్గాలు గణనీయమైన జనాభాను కలిగి ఉన్నాయి.

మైనార్టీల జనాభా విషయానికి వస్తే, రాష్ట్రంలో ముస్లింలు 12.56 శాతం జనాభాతో కీలక శక్తిగా ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు (10.08 శాతం) బీసీ ముస్లింలుగానే వర్గీకరించబడ్డారు. ఇతర మైనార్టీలైన క్రైస్తవులు, సిక్కులు, జైనుల జనాభా ఒక్క శాతం లోపు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ సర్వే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పన, రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ జరగనుంది. ఏ వర్గానికి ఎంత వాటా దక్కాలనే దానిపై ఈ గణంకాలు స్పష్టతనిచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *