ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్ ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ సబ్ డివిజన్ లో శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచీ ఏడుగంటల వరకు జిల్లాలో బొబ్బిలి పొలీస్ సబ్ డివిజన్ లో‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, నాటుతుపాకులు, నాటుసారా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు.
బొబ్బిలి డిఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలోబొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధి ఐ.టి.ఐ. కాలనీలో సుమారు 60మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఈగల్ సభ్యలుతో బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా సుమారు 200 ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో 250 వ్యక్తులను ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఐ.టి.ఐ. కాలనీలో అన్ని ఇండ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో సేకరించామని ఈ సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు తెలిపారు.
అదే విధంగా వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని 9 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసామన్నారు. ఐ.టి.ఐ. కాలనీలో హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తులతో మాట్లాడామని, వారి కదలికలపై నిత్యం నిఘా ఉంటుందన్నారు. ఈ ఆపరేషన్ బొబ్బిలి సీఐ కె.నారాయణరావు, బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్, పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది మరియు ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.