అప్పన్న చందనోత్సవం…దర్శించినవారి జన్మధన్యం

Simhachalam Chandanotsavam 2026

వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు సింహాచలం క్షేత్రంలో జరిగే చందనోత్సవం భక్తుల పాలిట కల్పవృక్షం. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే స్వామివారు, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే (సుమారు 12 గంటల పాటు) భక్తులకు తన అసలైన ‘నిజరూప’ దర్శనాన్ని ప్రసాదిస్తారు.

విలక్షణ రూపం: వరాహ ముఖం.. సింహ వాలం
భారతదేశంలోని మరే నరసింహ క్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ స్వామివారి రూపం అత్యంత విలక్షణంగా ఉంటుంది. ముఖం వరాహ రూపం, శరీరం మానవాకృతి, తోక సింహం వాలం మాదిరిగా ఉంటుంది. అందుకే ఈ స్వామిని ‘వరాహ లక్ష్మీనరసింహస్వామి’ అని పిలుస్తారు. హిరణ్యాక్షుడిని, హిరణ్యకశ్యపుడిని సంహరించిన రెండు అవతారాల కలయికగా ఈ విగ్రహాన్ని పురాణాలు అభివర్ణిస్తున్నాయి.

చందన లేపనం వెనుక పరమార్థం
హిరణ్యకశ్యపుడి సంహారం తర్వాత నరసింహస్వామి విపరీతమైన క్రోధాగ్నితో ఉండేవారట. ఆ ఉగ్రత్వాన్ని తగ్గించి స్వామిని శాంతింపజేయడానికి దేవతలు స్వామివారికి చందన లేపనం చేశారని ప్రతీతి. అందుకే సింహాచలంలో అప్పన్న నిత్యం చందనంతో మునిగి ఉంటారు. కేవలం అక్షయ తృతీయ నాడు ఆ చందనాన్ని ఒలిచి స్వామివారి దివ్యతేజస్సును భక్తులకు చూపిస్తారు. తిరిగి అదే రోజు రాత్రి మూడు విడతలుగా, ఆపై ఏడాదిలో మరో మూడు సందర్భాల్లో కలిపి మొత్తం 04 విడతలుగా (ఒక్కో విడత సుమారు 120 కిలోల చందనం) స్వామికి సమర్పిస్తారు.

పురూరవ చక్రవర్తి కీర్తి
పురాణ కాలంలో ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం కాలక్రమేణా భూస్థాపితం కాగా, కలియుగంలో పురూరవ చక్రవర్తికి స్వామి స్వప్నంలో కనిపించి తనను వెలికితీయమని కోరారు. అయితే స్వామిని బయటకు తీసే క్రమంలో ఆయన పాదాలు భూమిలోనే ఉండిపోయాయి. అందుకే నేటికీ సింహాచల క్షేత్రంలో స్వామివారి పాద దర్శనం లభించదు.

దర్శన విశిష్టత
అక్షయ తృతీయ నాడు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు సుమారు 12 గంటల పాటు నిజరూప దర్శనం లభిస్తుంది. ఏడాదికి మొత్తం 480 కిలోల (4 x 120 కిలోలు) చందనాన్ని అప్పన్నకు పూస్తారు. ఈ రోజు స్వామిని దర్శించుకుంటే జాతకంలోని కుజ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయని, భక్తులకు ఐహిక సుఖాలతో పాటు మోక్షం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *