కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana Govt to Revive Kaleshwaram Project, Says CM Revanth Reddy

“లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నాం..” అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

✅కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మత్తులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(#NDSA), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(#CWPRS), నీటి పారుదల శాఖ అధికారులు, బ్యారేజీ నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు, ఎన్డీఎస్ఏ చైర్మన్ గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బ్యారేజీ వద్ద జరుగుతున్న పరీక్షలను మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రత్యక్షంగా పరిశీలించారు.

✅జరుగుతున్న పరీక్షలపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. అనంతరం మంత్రులు ఉత్తమ్ గారు, పొంగులేటి గారు, వివేక్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.

✅సంబంధిత అన్ని సంస్థలు, సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలతో #KaleshwaramProject ను ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణయించాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి అందరినీ కలుపుకుని పర్యటనకు వచ్చాం.

✅అలాగే తుమ్మడిహెట్టి వద్ద ఆపేసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి అక్కడి నుంచి చేవెళ్ల వరకు నీటిని తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

✅గోదావరి జలాల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలకు సాగు, తాగునీరు అందించాలని ప్రాజెక్టుకు 1975 లో అంకురార్పణ జరిగింది.

✅వివిధ కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగని నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల నిర్మించాలని 2009 లో ప్రాజెక్టును ప్రారంభించారు.

✅160 టీఎంసీల నీటి కేటాయింపులతో రూ. 38,500 కోట్లతో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, అదే విధంగా పరిశ్రమలు, హైదరాబాద్ తాగునీటి కోసం పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండేళ్ల వరకు మొత్తంగా ప్రాజెక్టు కోసం 11,700 కోట్లు ఖర్చు పెట్టారు.

✅అలాంటి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో తుమ్మడిహెట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టు స్థలం మార్చి అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. 2016 లో మొదలుపెట్టి 2019 లో పూర్తయిందని చెప్పారు. అయితే, బ్యారేజీలో లీకులు, లోపాలు ఉన్నాయని 2020 లోనే ఇంజనీర్లు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖలు రాసి తెలిపారు.

✅2023 లో కుప్పకూలడంతో ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ 2023 నవంబర్ 1వ తేదీన ప్రాథమిక నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే మొదటి నివేదిక అందించింది. తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చింది.

✅ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టుపై నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రాజెక్టు మరమ్మత్తులు, పునర్నిర్మాణం చేసి తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాం. అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *