తెలంగాణలో మరో కొత్త పార్టీ…అసంతృప్తి నాయకులకు పండగే

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి వేడెక్కింది. ఇన్నాళ్లూ ఉద్యమ పార్టీగా, అధికార శక్తిగా వెలుగొందిన బీఆర్‌ఎస్ (BRS)లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి పార్టీతో తెగదెంపులు చేసుకుని, సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈనెల ఏప్రిల్ 25న హైదరాబాద్ శివారులోని మేడ్చల్ ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్-6 వద్ద భారీ బహిరంగ సభ ద్వారా తన కొత్త పార్టీని ప్రకటించేందుకు కవిత సర్వం సిద్ధం చేసుకున్నారు.

వస్తోంది ‘తెలంగాణ ప్రజాజాగృతి పార్టీ’!
చాలా కాలంగా సామాజిక, సాంస్కృతిక సంస్థగా సేవలందిస్తున్న ‘తెలంగాణ జాగృతి’ ఇప్పుడు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త పార్టీ పేరు “తెలంగాణ ప్రజాజాగృతి పార్టీ”గా దాదాపు ఖరారైంది. అమరవీరుల ఆశయాలు, సంపూర్ణ వికాసం అనే నినాదంతో కవిత ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇన్నాళ్లూ తన సంస్థ ద్వారా నిర్మించుకున్న బలమైన క్యాడర్‌ను ఇప్పుడు ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే ఆమె ప్రధాన లక్ష్యం.

అసంతృప్త నేతలకు ‘బంగారు బాట’?
ఈ కొత్త పార్టీ ఆవిర్భావం వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో గుర్తింపు లేక, ప్రాధాన్యత దక్కక అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులకు కవితక్క పార్టీ ఒక గొప్ప వేదికగా మారనుంది. రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పనిచేయనుంది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య నలిగిపోతున్న తటస్థ ఓటర్లను ఆకర్షించడమే ప్రధాన వ్యూహంతో పార్టీ అడుగుల వేయబోతున్నది.

రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
రాష్ట్రంలో ఇప్పటికే మూడు బలమైన శక్తులు తలపడుతున్న వేళ, కవిత పెడుతున్న ఈ ‘వేరు కుంపటి’ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం. అయితే, “తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మా అడుగులు ఉంటాయి” అని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 25 సాయంత్రం లోపు పార్టీ విధివిధానాలు, జెండా మరియు అజెండాపై పూర్తి స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *