13/06/2026
Kurma Jayanti Significance

Kurma Jayanti Significance

వైశాఖ పూర్ణిమ అంటే భక్తులకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజునే భగవంతుడు కూర్మావతారంగా అవతరించి ప్రపంచానికి ధర్మాన్ని కాపాడిన ఘట్టం గుర్తుచేసుకుంటారు. క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతం కుంగిపోతుంటే, మహావిష్ణువు తాబేలు రూపంలో తన వీపుపై ఆ కొండను మోసి దేవతలకు అమృతాన్ని అందించిన సంఘటనకు గుర్తుగా కూర్మజయంతి జరుపుకుంటారు.

ఈ అవతారానికి ప్రత్యేకంగా అంకితమైన ఆలయం ప్రపంచంలో ఒకటే ఉంది… అదే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకూర్మం క్షేత్రం. ఈ ఆలయ చరిత్ర కేవలం వందల సంవత్సరాలు కాదు, పురాణాల ప్రకారం కృతయుగం వరకు వెళ్తుంది. 7వ శతాబ్దం నుంచే ఈ క్షేత్రం వెలుగులోకి వచ్చిందని చరిత్ర చెబుతోంది.

ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇవ్వడం అత్యంత విశేషం. ఇంకా శివకేశవుల ఐక్యతకు సంకేతంగా 2 ధ్వజస్తంభాలు ఉండటం అరుదైన ప్రత్యేకత. ఆలయంలోని శ్వేతగుండం పుష్కరిణి ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని, పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇక్కడి శిల్పకళ కూడా అద్భుతమే. ప్రతి స్తంభం వేర్వేరు ఆకృతులతో నిర్మించబడింది. ఒకేలా కనిపించే రెండు స్తంభాలు కూడా ఉండవు. ఇది ఆలయ నిర్మాణ ప్రతిభను స్పష్టంగా చూపిస్తుంది.

ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున జరిగే కూర్మజయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆ రోజున అన్నదానం, జలదానం చేస్తే 100 రెట్లు పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం భక్తులకు సంపూర్ణ యాత్రగా భావిస్తారు.

Also Read  రథసప్తమికి అరసవల్లి వెళ్తున్నారా…టికెట్లు ఇలా బుక్‌ చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *