AP Congress Slams Govt Over APSRTC Privatization Attempts
ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఉనికిని దెబ్బతీసేందుకు అధికార కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతాయని, ప్రస్తుత పరిణామాలు దానికి అద్దం పడుతున్నాయని ఆరోపించింది. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నివారణ పేరుతో తెస్తున్న ఎలక్ట్రికల్ బస్సుల (E-Buses) వెనుక ప్రైవేటీకరణ దాగి ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.
సొంతంగా కొనుగోలు చేయాలి
అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఈ-బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం ఇచ్చే సబ్సిడీలను వాడుకుని, ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా ఈ బస్సులను కొనుగోలు చేసి, సొంతంగా నిర్వహించాలని డిమాండ్ చేసింది. సంస్థకు ఉన్న విలువైన భూములు, డిపో స్థలాలను ప్రైవేటు వారికి లీజులకు ఇచ్చే కుతంత్రాలను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
జేఏసీ ఉద్యమానికి మద్దతు: ఆర్టీసీ ఉనికిని కాపాడుకునేందుకు జూన్ 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ (JAC) చేపట్టిన ఎర్ర బ్యాడ్జీల నిరసన దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ప్రధాన డిమాండ్లు ఇవే:
- సంస్థలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
- ఉద్యోగుల వేతన సవరణ (PRC), ఇతర పెండింగ్ ఆర్థిక అంశాలను తక్షణమే పరిష్కరించాలి.
- సంస్థను కేవలం అద్దె బస్సులకు అడ్డాగా మార్చి, పేదవాడి రవాణా వ్యవస్థను ‘సైలెంట్ కిల్లర్’ పాలసీతో సమాధి చేయవద్దు.
ప్రజా రవాణా వ్యవస్థను వ్యాపార కోణంలో కాకుండా, సేవా దృక్పథంతో చూడాలని, ఆర్టీసీ అస్తిత్వాన్ని కాపాడటం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కాంగ్రెస్ హెచ్చరించింది.