భారత ఆటోమొబైల్ చరిత్రలో మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేసిన కారు ఏదైనా ఉందంటే అది మారుతి 800. ఇప్పుడు అదే కారు 1984 నాటి పాత బిల్లు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అప్పటి ధరలు, నేటి మార్కెట్ పరిస్థితులు పోల్చుకుంటూ నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక యూజర్ షేర్ చేసిన బిల్లు ప్రకారం, 1984 జూలై 12న మధ్యప్రదేశ్‌లోని బగన్ గ్రామానికి చెందిన శ్యామ్ రావు అనే వ్యక్తి మారుతి 800 కారును కొనుగోలు చేశారు. ఆ బిల్లులో కారు ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.47,500 మాత్రమే ఉంది. ఇన్సూరెన్స్, రోడ్ టాక్స్ కలిపినా మొత్తం ఆన్-రోడ్ ధర అప్పట్లో సుమారు రూ.60,000 లోపే ఉండటం విశేషం.
ఆ రోజుల్లో రూ.60,000తో కారు కొనడం అంటే పెద్ద విషయం. అయినా మారుతి 800 మాత్రం మధ్యతరగతి కుటుంబాలకు సొంత కారు కలను అందించింది. ఆ కాలంలో ఎయిర్ కండిషనర్ వంటి సౌకర్యాలు లేకపోయినా, ఈ కారు ఒక స్టేటస్ సింబల్‌గా భావించేవారు.
ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం, 1984లోని రూ.60,000 విలువను ద్రవ్యోల్బణం ఆధారంగా చూస్తే నేటి విలువ సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటుంది. అంటే అప్పటి ధరను నేటి మార్కెట్‌తో పోల్చితే అది ఇంకా చవకగానే అనిపిస్తుంది.
అయితే ఈ వైరల్ బిల్లు నిజమా కాదా అనే విషయంలో కొంతమంది నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫాంట్, డిజైన్ ఆధారంగా ఇది ఫేక్ లేదా ఎడిట్ అయి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ధృవీకరణ రాలేదు.
ఏదేమైనా, మారుతి 800 భారత రోడ్లపై సృష్టించిన ప్రభావం మాత్రం అసాధారణం. నేటి లగ్జరీ కార్ల మధ్య కూడా ఈ చిన్న కారు పేరు వినగానే మధ్యతరగతి కుటుంబాల తొలి కారు జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తాయి.