Iran Strikes US Bases in Gulf, Tensions Push Region to Brink
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. రెండు నెలలుగా కొనసాగుతున్న బలహీనమైన కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ, అమెరికా-ఇరాన్ దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడ్డాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్ నగరాలపై వైమానిక దాడులు చేయడంతో, ఇరాన్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) క్షిపణుల వర్షం కురిపించింది.
వ్యూహాత్మక జలసంధి బంద్: ఇరాన్ హెచ్చరిక
అమెరికా దాడులకు నిరసనగా ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి)ని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. “మా ప్రాంతాన్ని అశాంతికి గురిచేస్తే, గల్ఫ్ రీజియన్‌ను మీకు నరకంగా మారుస్తాం” అని ఐఆర్జీసీ ఏరోస్పేస్ చీఫ్ మాజిద్ మూసవి హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడిచమురు ధర బారెల్‌కు 94.56 డాలర్లకు చేరింది.
ఎప్పుడూ ఒకేలా…ఎంత చలిలోనూ గడ్డకట్టడు…శివమాయ అంటే ఇదే
12 బాలిస్టిక్ క్షిపణులతో దాడి
జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన ‘అల్-అజ్రాక్’ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఏకంగా 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అక్కడ ఉన్న ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16 యుద్ధ విమానాలను, కంట్రోల్ రూమ్‌లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటు కువైట్, బహ్రెయిన్‌లలో సైతం సైరన్లు మోగాయి. కువైట్ తన వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా కొన్ని క్షిపణులను కూల్చివేసి, విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ట్రంప్ దూకుడు.. సంధికి పిలుపు
అంతకుముందు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “ఇరాన్‌పై మరిన్ని బలమైన దాడులు చేస్తాం” అని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని, చర్చలు దాదాపు చివరి దశకు వచ్చినా ఇరాన్ కాలయాపన చేస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు సిరిక్, బందర్ అబ్బాస్ వంటి ఇరాన్ తీరప్రాంత నగరాల్లోని రాడార్లు, వైమానిక రక్షణ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక దాడులతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.