మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, శత్రువు తూటాల కంటే ‘ఆకలి’ అమెరికా సైన్యాన్ని ఎక్కువగా భయపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అని చెప్పుకునే యూఎస్ దళాలు, ప్రస్తుతం సముద్రం మధ్యలో తిండి లేక అలమటిస్తున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు మొదలైనప్పటి నుంచి యూఎస్ఎస్ అబ్రహం లింకన్, యూఎస్ఎస్ ట్రిపోలి వంటి భారీ యుద్ధనౌకల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. సరఫరా గొలుసు తెగిపోవడంతో, గగనతలం మూసివేయడం వల్ల 27 సైనిక జిప్ కోడ్‌లకు డెలివరీలను పోస్టల్ సర్వీస్ నిలిపివేసింది. ఫలితంగా, సైనికుల ప్లేట్లలో కేవలం రెండు ముక్కల ఎండు మాంసం, గుప్పెడు ఉడికించిన క్యారెట్లు తప్ప ఏమీ కనిపించడం లేదు.
తాజా పండ్లు, కూరగాయలు లేక మనోధైర్యం పూర్తిగా దెబ్బతింటోందని సైనికులు తమ కుటుంబాలకు పంపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ బిడ్డలు దేశం కోసం కాకుండా, ఆకలితో చనిపోతారేమోనని అమెరికాలోని వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అగ్రరాజ్యం ఆయుధాల మీద పెట్టిన శ్రద్ధ, కనీసం తన సైనికుడి కడుపు నింపడంపై పెట్టలేకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం గెలుస్తారో లేదో కానీ, ఈ ఆకలి పోరాటంలో సైనికులు ఓడిపోతున్నారనేది పచ్చి నిజం.