బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన: చంద్రబాబుతో ఆర్టీజీఎస్ సందర్శన, వ్యవసాయ క్షేత్రంలో టెక్నాలజీ పరిశీలన

Bill Gates Visits Andhra Pradesh, Reviews RTGS Governance and Agri-Tech Initiatives with CM Chandrababu Naidu

ఈరోజు ఉదయం GATES FOUNDATION చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్ కి విచ్చేసిన సంగతి తెలిసిందే… ఎయిర్పోర్ట్ లో IT మినిస్టర్ లోకేష్ స్వయంగా బిల్ గేట్స్ ని రిసీవ్ చేసుకుని, తమ రాష్ట్రానికి ఆహ్వానం పలికారు… అలాగే ఈరోజు బిల్ గేట్స్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయ్…

గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడితో కలిసి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆయన పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, వస్తున్న ఫలితాలను సీఎం వివరించారు. ఆర్టీజీఎస్‌లోని డిస్ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను బిల్ గేట్స్ చూశారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని ఆయన కితాబిచ్చారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ ప్రశంసించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని సీఎం వివరించారు. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.

అలాగే బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్‌కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఇక ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ నేడు సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.

Also Read  ప్రజల మధ్యే నూతన సంవత్సరం మజ్జి శ్రీనివాసరావు , ప్రదీప్ నాయుడు సిరమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *