Why Some Places Want to Leave UNESCO World Heritage List
ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యునెస్కో’ (UNESCO) ఒక ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తిస్తే.. అది ఆ దేశానికే గర్వకారణం. పర్యాటకం పెరుగుతుంది, నిధులు వస్తాయి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. “మాకు మీ గుర్తింపు వద్దు.. మా పేర్లను ఆ జాబితా నుండి తొలగించండి” అంటూ కొన్ని ప్రాంతాల ప్రజలు ఏకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ప్రపంచ వారసత్వ హోదా వల్ల వచ్చే పర్యాటక రద్దీ, కఠినమైన నిబంధనలు స్థానిక ప్రజల ప్రశాంత జీవితాలను అతలాకుతలం చేస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం యునెస్కో జాబితాలో 170 దేశాలకు చెందిన 1,248 ప్రదేశాలు ఉన్నాయి. అయితే, ఇందులో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
పర్యాటక సెగ… రెండు భిన్నమైన కథనాలు
కేవలం 20 మంది జనాభా.. లక్ష మంది పర్యాటకులు
మధ్య స్లోవేకియా పర్వతాల్లో ‘వ్ల్కోలినీజ్’ (Vlkolínec) అనే ఒక చిన్న మధ్యయుగ గ్రామం ఉంది. ఇక్కడ కేవలం 20 మంది శాశ్వత నివాసితులు, ఫేరీటేల్ కథల్లోలా ఉండే 45 రంగుల ఇళ్లు ఉన్నాయి. దీని ప్రత్యేక శైలి కారణంగా 1993లో యునెస్కో దీనికి వారసత్వ గుర్తింపు ఇచ్చింది. అంతే.. అప్పటి నుండి ఇక్కడికి ఏటా 1,00,000 మందికి పైగా పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఫోటోల గోల ఎక్కువైపోవడంతో, ప్రశాంతత కోల్పోయిన స్థానికులు తమ గ్రామాన్ని ఆ లిస్ట్ నుండి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సొంత గడ్డపైనే పరాయివాళ్లుగా మారుతున్న గిరిజనులు
టాంజానియాలోని ‘న్గోరోంగోరో’ (Ngorongoro) వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో శతాబ్దాలుగా ‘మాసాయి’ అనే గిరిజన తెగ ప్రజలు పశువులను కాస్తూ జీవిస్తున్నారు. అయితే యునెస్కో నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం వారిని తమ పూర్వీకుల భూముల నుండి వెళ్లగొడుతోంది. దీంతో ‘మాసాయి ఇంటర్నేషనల్ సాలిడారిటీ అలయన్స్’ తమ ప్రాంతాన్ని యునెస్కో జాబితా నుండి తొలగించాలని పోరాడుతోంది.
‘మ్యూజియమైజేషన్’
నిపుణులు దీనిని “మ్యూజియమైజేషన్” అని పిలుస్తున్నారు. అంటే బ్రతుకుతున్న నగరాలను పర్యాటకుల కోసం ఒక ప్రదర్శన వస్తువులా మార్చడం. 1987లో గుర్తింపు పొందిన ఇటలీలోని వెనీస్ నగరం, నేడు మితిమీరిన పర్యాటకంతో (Overtourism) ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాలు, ఇళ్ల ధరలు పెరిగిపోవడంతో స్థానికులు నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. చైనాలోని లిజియంగ్, మొరాకోలోని మర్రకేష్ స్థానిక సంస్కృతి అంతరించిపోయి కేవలం పర్యాటక వస్తువులు అమ్మే దుకాణాలు, హోటళ్లు మాత్రమే మిగిలాయి. పలు పోరాటాల కారణంగా ఇప్పటి వరకు మూడు ప్రాంతాలను ఈ జాబితా నుంచి తొలగించారు. అందులో ఒకటి అరేబియన్ ఒరిక్స్ శాంక్చురి. ఇది ఒమన్‌లో ఉంది. చమురు అన్వేషణ కోసం రక్షిత ప్రాంతాన్ని తగ్గించారు. అదేవిధంగా జర్మనీలోని డ్రెస్డెన్ ఎల్బే వ్యాలీ నదిపై ఆధునిక వంతెన నిర్మించి ప్రకృతి అందాన్ని దెబ్బతీసినందుకుగా యునెస్కో నుంచి తొలగించారు. తీరప్రాంంలో ఆధునిక భవనాలను ఏర్పాటు చేస్తున్నారని లివర్‌పూల్ మారిటైమ్ సిటీని కూడా తొలగించారు. విచిత్రం ఏంటంటే, యునెస్కో గుర్తింపు కోల్పోయినప్పటికీ లివర్‌పూల్, డ్రెస్డెన్ నగరాలలో పర్యాటకుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు.
యునెస్కో ప్రతినిధి పీటర్ డిబ్రైన్ అభిప్రాయం ప్రకారం.. పర్యాటక నిర్వహణ ప్లాన్లను మార్చాలని వారు ప్రయత్నిస్తున్నారు, కానీ స్థానికుల ఇబ్బందులను పరిష్కరించే పటిష్టమైన వ్యవస్థ ప్రస్తుతానికి యునెస్కో వద్ద లేదు. కట్టడాలను కాపాడటం సులభమేమో కానీ, ఆ కట్టడాల నీడన బ్రతికే మనుషులను, వారి జీవనోపాధిని కాపాడటం చాలా కష్టమనే సత్యాన్ని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.