Tirumala Darshan Waiting Time
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసినప్పటికీ శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. వారాంతం కావడంతో శనివారం తిరుమలలో భక్తులతో అన్ని దర్శన మార్గాలు కిక్కిరిసిపోయాయి. ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు ఆక్టోపస్ భవనం వరకు చేరాయి. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం చేరుకున్న భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: హైందవ ధర్మం చెబుతున్న శిఖ రహస్యం
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెళ్లే భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలాగే సర్వదర్శన టోకెన్లు పొందిన భక్తులు 4 నుంచి 6 గంటల్లో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే 74,636 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 43,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.64 కోట్లకు చేరుకుంది. లడ్డూ ప్రసాదాల విక్రయం కూడా భారీ స్థాయిలో నమోదైంది. ఒక్కరోజులో 4.21 లక్షల లడ్డూలు విక్రయించగా, 3.18 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 4,253 మంది భక్తులకు వైద్య సేవలు అందించబడినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. భక్తుల విశ్వాసానికి, శ్రీవారి మహిమకు నిదర్శనంగా తిరుమలలో రద్దీ రోజురోజుకూ కొనసాగుతుండటం విశేషం.