ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను పెంచాలన్నది హైందవ సంప్రదాయంలో భాగంగా ఉంటుంది. తులసి మొక్కకు రోజూ నీరుపోసి పూజ చేస్తే ఆ ఇంటికి ఎంతో మంచిది. తులసి ఇంట్లో ఆనందాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మకం. తులసి మొక్కకు నీళ్లు మాత్రమే కాకుండా పాలతో కూడా పూజించాలని, అందులోనూ ప్రతి గురువారం, శుక్రవారం రోజున తులసికి నీళ్లు, గోక్షీరం కలిపి సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఇలా గోక్షీరాన్ని సమర్పించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలుంటాయని అంటున్నారు. తులసికి గోక్షీరాన్ని సమర్పించడం వలన శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి పాలతో అభిషేకించిన పుణ్యం వస్తుందని నమ్మకం.
Read More: ఫిఫా 2026ః దక్షిణాఫ్రికాపై మెక్సికో థ్రిల్లింగ్ విక్టరీ
ఇక ప్రతినెల పంచమి తిథి రోజున తులసికి నైవేద్యంగా చెరుకు రసాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఆధ్యాత్మిక సాధనలో ఎదురయ్యే అవరోధాలు తొలగిపోతాయని నమ్మకం. కుటుంబంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతుంది. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావించడం హైందవ సంప్రదాయంలో భాగం. ఈ నేపథ్యంలో అమ్మవారిని అలంకరించిన విధంగానే పువ్వులు, అలంకరణ వస్తువులు, గాజులతో తులసిని కూడా అలంకరించవచ్చు. ఇలా చేయడం వలన అమ్మవారు సంతోషించ సిరిసంపదలను ఇస్తారని నమ్ముతారు. ప్రతిరోజూ నిత్యపూజానంతరం రాగి లేదా ఇత్తడి పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటిని తులసి మొక్కకు సమర్పించాలి. ఇలా చేయడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని అంటారు. తిథుల్లో అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడే ఏకాదశి రోజున తులసికి గంగాజలాన్ని సమర్పించడం వలన జన్మజన్మల పాపాలు పరిహారమౌతాయని పండితులు చెబుతున్నారు.