FIFA World Cup 2026 Mexico vs South Africa
ఫిఫా ప్రపంచకప్-2026ను ఆతిథ్య దేశం మెక్సికో ఘన విజయంతో ప్రారంభించింది. మెక్సికో సిటీలోని చారిత్రాత్మక అజ్టెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 80,824 మంది అభిమానులతో కిక్కిరిసిన స్టేడియంలో మెక్సికో ఆటగాళ్లు తొలి నిమిషాల నుంచే దూకుడును ప్రదర్శించి అభిమానులను ఉర్రూతలూగించారు.
మ్యాచ్ ప్రారంభమైన తొమ్మిదో నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ గోల్ సాధించి మెక్సికోకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగంలోనే మరిన్ని అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచడంలో మెక్సికో విఫలమైంది. అయినప్పటికీ ఆటపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. రెండో అర్ధభాగంలో 66వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ అద్భుత హెడర్‌తో మరో గోల్ నమోదు చేసి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.
Read More: Karna: ఇలా చేస్తే దానంలో కర్ణుడిని మించిపోవచ్చు
ఈ గోల్‌తో జిమెనెజ్ మెక్సికో తరఫున 46 గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. జాతీయ జట్టుకు అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జారెడ్ బోర్గెట్టితో కలిసి రెండో స్థానానికి చేరుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న జేవియర్ “చిచారిటో” హెర్నాండెజ్ రికార్డుకు అతను కేవలం ఆరు గోల్స్ దూరంలో ఉన్నాడు.
అయితే ఈ మ్యాచ్‌లో గోల్స్‌తో పాటు రెడ్ కార్డులు కూడా ప్రధాన చర్చగా మారాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్పెఫెలో సిథోలే, థెంబా జ్వానేలకు రెడ్ కార్డులు రావడంతో ఆ జట్టు తొమ్మిది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. అదనపు సమయంలో మెక్సికో డిఫెండర్ సీజర్ మాంటెస్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో ఏకంగా మూడు రెడ్ కార్డులు నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
విజయం అనంతరం మెక్సికో కోచ్ జావియర్ అగ్విరే సంతోషం వ్యక్తం చేశాడు. స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం ఎంత ప్రత్యేకమో యువ ఆటగాళ్లు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవించారని పేర్కొన్నాడు. తొలి అర్ధభాగంలో తమ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించిందని, రెండో భాగంలో కొంత నెమ్మదించినా విజయంతో టోర్నీ ప్రారంభించడం సంతోషకరమని చెప్పాడు.
ఈ విజయంతో గ్రూప్-ఎలో మెక్సికో మూడు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాను ఎదుర్కోనుంది. మరోవైపు ఓటమితో టోర్నీ ప్రారంభించిన దక్షిణాఫ్రికా, చెక్ రిపబ్లిక్‌తో జరిగే మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. ఖతార్ ప్రపంచకప్‌లో ఎదురైన నిరాశను మరిపిస్తూ మెక్సికో ఈసారి బలమైన సంకేతాలు పంపింది. స్వదేశ గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.