ఒకటే పాలసీ…రెండు ప్రయోజనాలు..భార్యభర్తలకు బంపర్‌ ఆఫర్‌

LIC New Jeevan Saathi Plans 2026

దేశంలో బీమా రంగంలో విశ్వసనీయ సంస్థగా పేరొందిన ఎల్‌ఐసీ (LIC) మరోసారి సామాన్య కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రెండు కొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలిద్దరికీ ఒకే పాలసీలో బీమా రక్షణ, పొదుపు ప్రయోజనాలు కల్పించేలా “న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం”, “న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం” పేర్లతో ఈ ప్లాన్స్‌ను జూన్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఉద్యోగాలు చేసే దంపతులు, కుటుంబ భద్రతపై ఆలోచించే మధ్యతరగతి ప్రజలకు ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి.

ఇప్పటివరకు ఎక్కువగా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పాలసీ తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ సంపాదనలో భాగస్వాములవుతున్నారు. అలాంటి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఈ జాయింట్ పాలసీలను ఎల్‌ఐసీ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పాలసీల్లో బీమాతో పాటు గ్యారెంటీడ్ అడిషన్ రూపంలో అదనపు లాభం కూడా లభిస్తుంది. ప్రతి రూ.1000కు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ అందించనున్నారు.

“న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం” పాలసీలో ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించాలి. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి లేదు. ఉదాహరణకు 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.10 లక్షల బీమా తీసుకుంటే సుమారు రూ.8 లక్షల సింగిల్ ప్రీమియం చెల్లించాలి. పాలసీ గడువు పూర్తయ్యే సరికి గ్యారెంటీడ్ అడిషన్లతో కలిపి దాదాపు రూ.24 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

ఇక “న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం” పాలసీలో 5, 10 లేదా 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. పాలసీ టర్మ్ మాత్రం 10 నుంచి 25 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు రూ.10 లక్షల బీమా కోసం సంవత్సరానికి సుమారు రూ.1.30 లక్షల ప్రీమియం చెల్లిస్తే, మెచ్యూరిటీ సమయానికి గ్యారెంటీడ్ అడిషన్లతో కలిపి సుమారు రూ.28 లక్షలు పొందవచ్చు.

ఈ రెండు పాలసీల్లోనూ భార్యాభర్తల్లో ఒకరికి ఏదైనా ప్రమాదం జరిగినా బీమా మొత్తం అందుతుంది. రెండో వ్యక్తికి కూడా రిస్క్ జరిగితే నామినీకి మొత్తం చెల్లిస్తారు. అదనంగా లోన్ సదుపాయం, యాక్సిడెంటల్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్‌నెస్ వంటి రైడర్లను కూడా జోడించుకునే అవకాశం ఉంది. కుటుంబ భద్రతతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు కోరుకునే వారికి ఈ కొత్త LIC పాలసీలు మంచి ఎంపికగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *